బోడ కాకర కాయలు , అదే , ఆ కాకర కాయలు - బెల్లం వేసి తీపి కూర చేసినా , వేపుడు చేసినా దేనికదే ప్రత్యేకం- వెంట్రుకలున్న కొప్పు ముడిచినా అందమే , ముడవకున్నా అందమే !!
మరి పొట్లకాయ పెరుగు పచ్చడి , లేత కొబ్బరి పచ్చడి , ముద్దపప్పు , గుత్తివంకాయ , దోసకాయ కారపు పచ్చడి, దోసకాయ పెరుగు పచ్చడి , అబ్బో దీనికి అంతులేదు , దీని తస్సాదియ్యా!
వానలు, ఆరుద్ర పురుగులు , గోదలకు పచ్చని గడ్డి మోపులు , కొత్త లేపాక్షి నోట్ - బుక్కుల్లో పడిన వర్షపు చుక్కల వల్ల ఉత్పన్నమైన సువాసన, కొత్త పుస్తకాలు, వాటికి వేసే గోధుమరంగు అట్టలు,
సోమవారం శివయ్యకు అభిషేకాలు ,ఉపవాసాలు,. వీధి లో అభిషేకాలకోసం పరుగెత్తే బ్రాహ్మలు; కొందరు స్వయంగా చేసుకోవడం , మరికొందరు బ్రాహ్మలతో జరిపించుకోవడం.
కర్మయోగి , మాతండ్రి పరమ శుచి గా మడితో శివాలయంలో అభిషేకాలు, బయట వాన , లోపల శివుడికి అభిషేక వర్షం,. అపుడపుడే ప్రదోషం కాలం ప్రవేశించి , ప్రకృతి మొత్తం రాగరంజితమై , నీల జీమూతాలు గర్జనలు సలుపుతుంటే , శివ పరివారంతో కలిసి మహదేవుడు ఆనంద నాట్యం చేస్తున్నట్టే ఉంది.
*ఉదయగ్రావము పానబట్టము
అభిషేకోద ప్రవాహంబు వార్ధి
తమోధ్వాంతము ధూపధూమము
జ్వలద్దీప ప్రభారాజి కౌముది
తారానివహంబులు అర్పిత సుమంబులుగాన్
తమోదూర సౌఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగంబు ఒప్పె ప్రాచీదిశన్||*
మంచి గంధం, నిత్యమల్లె పూలు, అభిషేక జలాలు స్వఛ్ఛమైన బావి నీరు , తళతళ లాడే రాగి , ఇత్తడి పాత్రలు, ఘమఘమలాడే అగరు ధూపాలు , నాన్న నడుస్తుంటే భక్తితో నమస్కరించి దూరంగా జరిగే పౌరులు. సాయంత్రం ఏకాదశ రుద్రాభిషేకాల తర్వాత , ఇంటికి పిలిచిన బ్రాహ్మణ దంపతులతో సహపంక్తులు, షడ్రసోపేతమైన తెలుగు భోజనం , తెలంగాణ శాకంబరీ దేవి వరప్రసాదం- బోడకాకరకాయతో పాటుగా..
ఒకవారం లేతకొబ్బరి పచ్చడి , మరొకవారం మరొక రోటి పచ్చడి. ఒకవారం పరమాన్నం మరొకవారం పుణుకులు ( బూరెలు). ఒకవారం గుత్తి వంకాయ, మరొక వారం దొండకాయ శనగపప్పు- బోడకాకరకాయ తప్పనిసరి!!
ఆషాడమాస విరహవేదనలతో అప్పడే అత్తగారిళ్ళకు చేరిన కొత్తకోడళ్ళు, వియ్యపు వారింటికి శ్రావణ పట్టీలు. కొత్త కోడళ్ళు, శ్రావణ మంగళవార, శ్రావణ శుక్రవార వ్రతాలు , పసుపు-బొట్లు ( పేరంటాలు) , పట్టు చీరల గరగరలు , నానబట్టిన శనగలు. పసుపు పారాణి, ఆరిందల్లాగా పట్టు పరికీణులు చుట్టుకున్న పిల్ల పేరంటాలు , అమ్మలక్కల లోకాభిరామాయణాలు , కొత్త కోడళ్ళ పరిచయాలు , దండాలు, గుడి గద్దెలమీద మొగరాయుళ్ళ బాతాఖానీలు.
వరలక్ష్మీ వ్రతాలు , ఇంట్లో కొబ్బరికాయలను శుభ్రం చేసి దానికి బాగా పసుపు రాసి , పసువుతోనే ముక్కను తయారించి , అతికించి , పెన్సిల్ కళ్ళు గీసి కనుపాపలు దిద్ది , ఒక చిన్నబిందె మీద ఉంచి చీరను మురిపెంగా కట్టి మురిసిపోయే ముత్తైదువులు. అపర సరస్వతి ఎమ్మెస్ అమ్మ శ్రీరాగంలో “శ్రీ వరలక్ష్మీ” , తర్వాత శ్రావ్యంగా లక్ష్మీ అష్టోత్తరం, ఆనక ఆఠానాలో “నీ ఇరంగాయనిల్ “ , అటుతర్వాత మధ్యమావతిలో “భాగ్యదా లక్ష్మీ బారమ్మా” టేప్-రికార్డులో సంగీత కచ్చేరీ చేయాల్సిందే.
భక్షాలు, బూరెలు, చింతపండు పులిహోర, పెరుగు పచ్చడి, సేమ్యా పాయసం, అవును .. బోడకాకరకాయ!! బ్రాహ్మణ భోజనాలు , ఆనక సాయంత్రం పసుపు-బొట్లు , శనగలు , పట్టు చీరలు , అబ్బో ఆ రెండో శుక్రవారం ధగధగలు , జిగజిగలు .
బంకమట్టి తో తయారు చేసిన ఎద్దు బొమ్మలు , రైతు బొమ్మలను ఒక పీటమీద పెట్టి ప్రకృతికి పూజ చేసి రైతుల, పశువుల పట్ల కృతజ్ఞత చూపించే పొలాల అమావాస్య పండుగ.
భాద్రపద మాసంలో గణపతులకు ఇప్పణ్ణించే సన్నాహాలు;
బాలల గణపతి కి బాలలు చందాలడగడం, పెద్దల గణపతి కి పెద్దల చందాలు, రశీదు బుక్కులు పట్టుకోని వాడంతా కలియ తిరగడం..
శ్రావణ మాసం పరమశివ కారుణ్య మాసం
శ్రావణ మాసం నిత్య పండగల ధార్మిక మాసం
శ్రావణ మాసం కొత్తదంపతుల మధుమాసం
రమణీయమైన ఆచారాలతో , నిత్య కళ్యాణం లా వెలిగిపోతూ భారత జీవన ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం లా వర్షించే శ్రావణానికి సాటీ, పోటీ లేదు, అది అధిక శ్రావణమైనా, నిజ శ్రావణమైనా!!
